గ్రేటర్ ఎన్నికల ఫలితాలు విడుదలై వారం కావొస్తున్నా.. నగర మేయర్ ఎవరనేదానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఏ పార్టీకీ పూర్తిస్థాయి ఆధిక్యం లేకపోవడంతో కొత్త పాలక మండలి ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్ ఎన్నికపై ఎవరి వ్యూహం ఎలా ఉండబోతోందా అని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్న వేళ.. కీలకమైన అంశం ఒకటి తెరపైకి వచ్చింది. అదే మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా మేయర్ కావొచ్చని!
జీహెచ్‌ఎంసీ చట్టం-1956 ప్రకారం మేయర్‌ను ఎన్నుకునేందుకు కచ్చితంగా సగానికిపైగా సభ్యుల మద్దతు అవసరం లేదు. మేజిక్ ఫిగర్‌తో సంబంధం లేకుండా.. ఏ వ్యక్తి అయితే ఎక్కువ మంది మద్దతు పొందుతారో.. ఆయనే మేయర్‌గా ఎన్నికవుతారని ఆ చట్టం స్పష్టం చేస్తోంది. అయితే ఇందు కోసం నిర్వహించే సమావేశానికి సగానికిపైగా సభ్యులు హాజరు కావాలని మాత్రం చెప్తోంది.
జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. టీఆర్ఎస్‌కు -56, బీజేపీ- 48, ఎంఐఎం- 44, కాంగ్రెస్- 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఎక్స్‌అఫీషియోలతో కలిపి టీఆర్ఎస్‌కు 86, ఎంఐఎం- 54, బీజేపీ- 50, కాంగ్రెస్‌కు ముగ్గురు సభ్యులుంటారు. ఎక్స్‌అఫీషియోలతో కలిసి మొత్తం 194 మందిగా లెక్క తేలగా.. మేజిక్ ఫిగర్ 98గా ఉంటుంది. కానీ మేయర్ కావాలంటే ఆ నెంబర్ తప్పనిసరి కాదని ఈ చట్టం చెబుతోంది. సో ఏ లెక్కన చూసినా టీఆర్ఎస్‌కే మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయన్నమాట.