మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు, అఘాడీ ప్రభుత్వ పెద్దల ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం ఉత్కంఠగా మారింది. దీంతో రాష్ట్ర రాజకీయాలను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇప్పటికే రెబెల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు భద్రతను తొలగించి రెబెల్స్ కు అఘాడీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది.
తాజాగా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మహా సర్కార్ మరోసారి షాక్ ఇచ్చింది. తిరుగుబాటు వర్గం పంపిన అవిశ్వాస తీర్మానాన్ని ఆ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం వెనుక పలు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది.
అవిశ్వాస తీర్మానం పై 33 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని సమాచారం. అయితే ఆ తీర్మానాన్ని వారిలో ఎవరూ నేరుగా ఇవ్వలేదని, గుర్తు తెలియని ఈ మెయిల్ ద్వారా తీర్మానాన్ని పంపించారని అందుకే ఆ తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారని తెలుస్తోంది.
దీని వెనుక మరో కారణం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తీర్మానాన్ని శివసేన లెటర్ హెడ్ పై పంపించారని తెలుస్తోంది. అసెంబ్లీ రికార్డుల ప్రకారం శివసేన పక్ష నేత అజయ్ చౌదరీ అని షిండే కాదని అందువల్ల ఆ తీర్మానాన్ని తోసిపుచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.