ఈ నెల 14 న వాలెంటైన్ డే ని ‘కౌ హగ్ డే’ గా పాటించాలని పిలుపునిచ్చిన జంతు సంక్షేమ సంస్థ.. ఎనిమల్ వెల్ ఫేర్ బోర్డు దీన్ని ఉపసంహరించుకుంది. మీకు అంగీకారమైతే ఏ రోజునైనా ఆవును హగ్ చేసుకోవచ్చునని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 14 వ తేదీని కౌ హగ్ డే గా పాటించి.. ఈ మూగజీవాలను కౌగిలించుకోవడం వల్ల పాడినిచ్చే పశువుల పట్ల మనం ప్రేమను వ్యక్తం చేసినట్టవుతుందని, వైదికాచారాలు కనుమరుగవుతున్న ఈ కాలంలో మన భారతీయ సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తుందని ఈ జంతు సంక్షేమ బోర్డు ఇటీవల వ్యాఖ్యానించింది. అయితే ఈ అప్పీలుపై వెనక్కి తగ్గుతున్నామని తాజాగా వెల్లడించింది.
ఈ పిలుపుపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఇదేం నిర్ణయమంటూ అనేకమంది నెటిజన్లు మీమ్స్ తో, జోకులతో వ్యంగ్యంగా స్పందించారు. శివసేన వంటి విపక్షాలు ఈ అప్పీలును అపహాస్యం చేస్తూ .. ప్రధాని మోడీకి బిలియనీర్ గౌతమ్ అదానీ ‘పవిత్రమైన గోవు’ వంటివారని సెటైర్ వేశాయి. ఇక ఇది కుహనా హిందూయిజానికి, కుహనా దేశభక్తికి నిదర్శనమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శంతను సేన్ ఆరోపించారు.
ఇది తమాషా కాన్సెప్ట్ అని, దేశానికే సిగ్గుచేటని సీపీఎం నేత ఎలమరం కరీన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రజనీపాటిల్.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, ప్రతిరోజూ ఆవును కౌగలించుకుంటానని తెలిపారు. ఇలాంటి పిలుపు .నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల నుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికేనన్నారు.
థాక్రే వర్గం శివసేన నేత సంజయ్ రౌత్ కూడా దాదాపు ఇలాగే స్పందించారు. ఇలా అన్ని వర్గాల నుంచి ఈ అప్పీలుకు వ్యతిరేకత రావడంతో ఎనిమల్ వెల్ ఫేర్ బోర్డు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.