జీఎస్టీ పరిహారం కొనసాగింపుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాష్ట్రాలకు నిరాశ ఎదురైంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే జీఎస్టీ మండలి సమావేశం బుధవారం ముగిసింది.

ఈ పరిహారం పొడిగింపు అంశంపై చర్చను ఎజెండాలో చేర్చినప్పటికీ దానిపై మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పుదుచ్చేరి ఆర్థిక మంత్రి కే. లక్ష్మీనారాయణన్ తెలిపారు. ఆగస్టులో జరగబోయే జీఎస్టీ మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆయన వెల్లడించారు.
మరోవైపు ఆన్ లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలు, లాటరీలపై 28శాతం పన్ను విధించాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసుకుంది. ఈ విషయంపై భాగస్వామ్య పక్షాలతో విస్తృత చర్చలు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ విషయంలో భాగస్వామ్య పక్షాల చర్చించి దానిపై జూలై 15లోగా నివేదిక అందించాలని మేఘాలయా ముఖ్యమంత్రి కొనార్డ సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందానికి ఆమె సూచించారు. ఈ నివేదికలపై నిర్ణయం తీసుకోవడానికి ఆగస్టులో కౌన్సిల్ మరోసారి సమావేశం అవుతుందని ఆమె వివరించారు.