జాతీయ పౌర రిజిష్టర్(ఎన్ఆర్సీ)పై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీ తయారు చేసే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని పార్లమెంట్ లో వెల్లడించింది.
కొవిడ్ కారణంగా ఎన్‌పీఆర్ , జనాభా లెక్కలు- 2021 మొదటి దశను నవీకరించే చర్యను వాయిదా వేసినట్టు పేర్కొంది. పార్లమెంట్‌లో ఎన్ఆర్సీ ,పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ (ఎన్ పీఆర్) లపై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ ప్రశ్న అడిగారు.
ఆ ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బదులిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 31, 2014కి ముందు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన ముస్లిమేతరుల పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ప్రభుత్వం డిసెంబర్ 2019లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తీసుకు రావాలని నిర్ణయించింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కేంద్రం ఈ విషయంలో వెనకడుగు వేసింది.