బజరంగ్ దళ్ లేదా ఆర్ఎస్ఎస్ లపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనపై చర్చలేవీ జరగలేదని కర్ణాటక మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఏర్పడిందని, అందువల్ల కీలకమైన ఇలాంటి అంశాలమీద తాము చర్చించలేదని ఆయన గురువారం చెప్పారు. ఆర్ఎస్ఎస్ తో బాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రాజకీయ లేదా మతపరమైన సంస్థలపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరో మంత్రి ప్రియాంక్ ఖర్గే నిన్ననే వ్యాఖ్యానించారు. దీనిపై మీడియా.. పరమేశ్వర వద్ద ప్రస్తావించగా.. ఆయన..ప్రస్తుతానికి ఈ దిశగా చర్చలు జరగడం లేదన్నారు.
ప్రియాంక్ వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయాలై ఉండవచ్చునన్నారు. గోవధ నిషేధం పైన, మత మార్పిడుల అంశంపైనా గత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, ఆమోదించిన చట్టాలను తాము సమీక్షించే అవకాశం ఉందని, చివరకు స్కూలు పాఠ్య పుస్తకాల్లో చేసిన మార్పులను కూడా తాము ఎత్తివేసినా ఎత్తివేసే ఛాన్స్ ఉందని ప్రియాంక్ పేర్కొన్నారు.
దీనిపై వ్యాఖ్యానించేందుకు పరమేశ్వర నిరాకరించారు. ఏమైనా ఈ విధమైన అంశాలపై తమ ప్రభుత్వం కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. మొదట పూర్తి స్థాయి సర్కార్ ఏర్పడాలన్నారు. పాలసీ నిర్ణయాలంటూ ఉంటాయని ఆయన చెప్పారు.
కర్ణాటకలో తాము అధికారంలోకి వచ్చిన పక్షంలో బజరంగ్ దళ్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వంటి సంస్ధలపై బ్యాన్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే తామిచ్చిన హామీల అమలులో వెనక్కి తగ్గేది లేదని పరమేశ్వర స్పష్టం చేశారు. బీజేపీ, జేడీఎస్ పార్టీలు తమ ప్రభుత్వం పట్ల అసూయతో ఉన్నాయన్నారు.