కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అనేక పథకాలకు ప్రస్తుతం ఆధార్ అవసరం అవుతుందన్న సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు లేకపోతే లబ్ధిదారులు ఎలాంటి పథకాలను అందుకోలేరు. అయితే ఆధార్ ఉండడమే కాదు, దానికి అనుసంధానమై ఉన్న ఫోన్ నంబర్ అప్‌డేటెడ్‌గా ఉండాలి. అంటే ఏదైనా అప్‌డేట్ చేస్తే ఆ ఫోన్ నంబర్‌కు ఠక్కున ఓటీపీ రావాలి. అప్పుడే మనం ఆధార్ సేవలను సులభంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోగలం.
- అయితే ఆధార్ కార్డుకు అనుసంధానమై ఉన్న ఫోన్ నంబర్‌ను మార్చాలన్నా, అసలు నంబర్ లేకపోతే కొత్తగా ఏదైనా ఫోన్ నంబర్‌ను అనుసంధానించాలన్నా.. అందుకు ఎలాంటి పత్రాలు అవసరం లేదు. ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళితే చాలు, చాలా సులభంగా ఆధార్‌కు ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేయవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు ఓటీపీలకు, ఆధార్ లో ఇతర వివరాలు మార్చేందుకు అనువుగా ఉంటుంది.
- ఇక ఆధార్ సేవా కేంద్రంలో ఫొటో, బయోమెట్రిక్స్, ఈ-మెయిల్ ఐడీ వంటి వాటిని మార్చాలన్నా ఎలాంటి పత్రాలు అవసరం లేదు. కేవలం ఆధార్ ఒరిజినల్ కార్డును తీసుకెళ్తే చాలు, చాలా సులభంగా ఆ వివరాలను మార్చుకోవచ్చు.
- ఆధార్ సెంటర్‌లో కొత్తగా ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ, లింగం, బయోమెట్రిక్స్ వంటి వివరాలను సులభంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.
- ఆధార్‌కు ఫోన్ నంబర్‌ను అప్‌డేట్ చేసి ఉండడం వల్ల ఓటీపీలను సులభంగా పొందవచ్చు. అలాగే ఈ-ఆధార్ పొందడం తేలికవుతుంది. ఇక ఆధార్ కార్డును ప్రస్తుతం డెబిట్ కార్డు సైజులో పీవీసీ రూపంలో అందిస్తున్నారు. కేవలం రూ.50 చెల్లిస్తే చాలు, పీవీసీ ఆధార్ కార్డు నేరుగా మీ ఇంటి చిరునామాకే పోస్టులో వస్తుంది.