కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలో అత్యున్నత నియామక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుల ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి అప్పగించింది. ఈ మేరకు చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
స్టీరింగ్ కమిటీ నిర్ణయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాకు వెల్లడించారు. సీడబ్ల్యూసీ ఎన్నికల అంశంపై స్టీరింగ్ కమిటీ చర్చించిందన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులను ఎంపిక చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికే కట్టబెడుతూ 45 మంది సభ్యులు నిర్ణయించారన్నారు.
ఎన్నికలకు కొందరు అనుకూలంగా ఉండగా, మరికొందరు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను తెలియజేశారన్నారు. ఈ నిర్ణయానికి ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులందరూ పూర్తి మద్దతిస్తారని తమకు విశ్వాసం ఉందన్నారు. పార్టీ రాజ్యాంగంలోని 32 నియమ నిబంధనలకు 16 సవరణలు తీసుకురావాలనే ప్రతిపాదనలపై ప్లీనరీలో నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. పార్టీకి చెందిన మాజీ ప్రధానులు, మాజీ అధ్యక్షులందరికీ వర్కింగ్ కమిటీలో ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు.
అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ…. రాయ్‌పుర్ కాంగ్రెస్ సమావేశాలు చాలా ప్రత్యేకమైనవన్నారు. సుమారు వందేండ్ల క్రితం 1924లో జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా మహత్మాగాంధీ ఇక్కడే ఎన్నికయ్యారని చెప్పారు. కాంగ్రెస్‌కు గాంధీ ఒక్కసారి మాత్రమే అధ్యక్షుడయ్యారన్నారు. కానీ అతి తక్కువ కాలంలోనే బడుగు, బలహీన వర్గాల ప్రజలను, యువతను కలుపుకుని ఉద్యమాన్ని తీర్చిదిద్దారన్నారు. మళ్లీ ఇప్పుడు అదే స్ఫూర్తి కావాలన్నారు. రాయ్‌పుర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరు కాకపోవడం గమనార్హం.