గ్రహాంతర వాసులు, ఫ్లయింగ్ సాసర్ల గురించి గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఏలియన్లు భూమిని సందర్శించారని, పలానా చోట్ల కనిపించారని ఇంటర్నెట్లో వీడియోలు కూడా చాలా సార్లు వైరల్ అయ్యాయి. అయితే ఏలియన్లపై పెంటగాన్ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏలియన్స్ భూమిపై దిగారని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అమెరికా సీనియర్ సైనిక అధికారులు తాజాగా వెల్లడించారు. యూఎఫ్వోకు సంబంధించిన అనేక ఘటనలతో రూపొందించిన వందలాది నివేదికలను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆ నివేదికల మేరకు తాము ఓ అంచనాకు వచ్చామన్నారు.
ఇంటెలిజెన్స్, భద్రత కోసం అమెరికా రక్షణశాఖ అండర్ సెక్రెటరీ రోనాల్డ్ మౌల్ట్రీ ఈ విషయాన్ని వెల్లడించారు. అంత మాత్రాన గ్రహాంతరవాసుల ఉనికిని కొట్టిపారేయలేమని ఆల్ డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్(ఏఏఆర్ఓ) డైరెక్టర్ సీన్ కిర్క్ప్యాట్రిక్ అన్నారు.
ఈ విషయాలన్నింటిపై శాస్త్రీయ విధానాల్లో పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు. తాజాగా ఆ సంస్థ నిర్వహించిన మొదటి వార్తా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గుర్తించని వైమానిక దృగ్విషయాలు(యూఏపీ)’అని పలు మార్లు అమెరికా సైన్యం చెప్పిన 140కి పైగా యూఎఫ్ఓ సంబంధిత ఘటనలను ఓ చోట చేర్చి ప్రభుత్వం గత ఏడాది ఓ నివేదికను తయారు చేసిందన్నారు. ఆ తర్వాత కూడా వందల కేసులూ నమోదైనట్లు కిర్క్ప్యాట్రిక్ చెప్పారు. వీటికి సంబంధించి కచ్చితమైన సంఖ్యను త్వరలో ప్రకటిస్తామన్నారు. మే నాటికే ఈ సంఖ్య 400కు చేరుకుందని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.