తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జీరో స్థాయికి చేరుకున్నాయని స్పష్టం చేశారు రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. సోమవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తాము ఆధారాలతో చెబుతుంటే.. కొందరేమో ఎలాంటి ఆధారాలు లేకుండా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కలను కూడా కొందరు నేతలు వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని కేంద్రమే పార్లమెంట్‌లో వెల్లడించిందని గుర్తు చేశారు.
తెలంగాణలో 10 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అర్థం పర్థం లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు తాడు, బొంగురం లేని కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు.
ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని కొందరు వ్యక్తులు, పత్రికలు, సంస్థలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. లేని ఆత్మహత్యలు ఉన్నట్టు చిత్రీకరించడం సరికాదన్నారు. పనిగట్టుకుని విషప్రచారం చేయడం మంచిది కాదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.