ప్రతిభ మీద గౌరవం, కళల మీద అభిమానం, కష్టం మీద ఒక నమ్మకం ఉన్న వాళ్లకు కొన్ని కొన్ని గొప్పగా కనపడుతూ ఉంటాయి. ఉన్నతంగా ఆలోచించే వాళ్లకు లక్ష్యాలు కూడా అర్ధమవుతాయి, ఉన్నతంగానే ఉంటాయి. ఈ స్టోరీ చదివితే అవి నిజమే అని మీకు నమ్మకం కలుగుతుంది. 6,300 లీటర్ల పెయింట్‌తో తయారు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ ను 450 కోట్లకు వేలం వేసి మరీ విక్రయించారు.
62 మిలియన్లకు విక్రయించారు దాన్ని. ఇది ఇప్పటివరకు వేలం వేసిన అత్యంత ఖరీదైన కళాకృతులలో ఒకటిగా నిలిచింది. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కళాకృతికి ‘ది జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. ఇక ఇది నాలుగు బాస్కెట్‌బాల్ కోర్టుల పరిమాణానికి సమానం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా చాలా తీవ్రంగా ఉంది.
తగ్గినట్టే తగ్గి మరోసారి తన ప్రతాపం ప్రపంచంపై చూపిస్తుంది ఈ మహమ్మారి. ఈ వ్యాధి బారిన పడిన పిల్లలను కాపాడుకోవడానికి డబ్బులను సేకరించడానికి బ్రిటిష్ కళాకారిణి సాచా జాఫ్రీ ఈ భారీ కళాకృతిని రూపొందించారు. ఆమె కళాకృతిని 70 ఫ్రేమ్‌లుగా విభజించారు. ముందు తన లక్ష్యాన్ని అందుకోవడానికి ఆమె ఈ పెయింటింగ్ ని ప్యానెల్స్ గా విడదీసి అమ్మాలి అని భావించారు. ఆమె లక్ష్యం 30 మిలియన్లు మాత్రమే.
కానీ దుబాయ్‌లో జరిగిన ఛారిటీ వేలం సందర్భంగా, ఆండ్రీ అబ్దున్ అనే వ్యాపారవేత్త అన్ని ఫ్రేమ్ లకు రెట్టింపు కంటే ఎక్కువ ఇచ్చాడు. “నేను ఒక పేద కుటుంబం నుండి వచ్చాను. తినడానికి ఏమీ లేకపోతే ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు. కాని కనీసం నాకు తల్లిదండ్రుల ప్రేమ, పాఠశాల విద్య మరియు మద్దతు నాకు ఉంది” అని క్రిప్టో-కరెన్సీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అబ్దున్ మీడియాకు చెప్పారు.
“పెయింటింగ్ నేను చూసినప్పుడు చాలా శక్తివంతమైనదిగా భావించా. ఇంత అందంగా ఉన్న పెయింటింగ్ ని, ముక్కలు వేరు చేయడం కరెక్ట్ కాదనిపించింది.” అందుకే కొనుక్కున్నా అని చెప్పాడు. అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని యునిసెఫ్, యునెస్కో, ది గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్ మరియు దుబాయ్ కేర్స్ లకు విరాళంగా ఇస్తారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.