– కంపెనీల్లో ఎక్కడా కనిపించని పేరు
-అధికారిక హోదా లేకున్నా అంతా ఆయనే
-సంస్థ విస్తరణలో ఆయనదే కీ రోల్
-తెర చాటున కథ మొత్తం నడిపేది ఆ శక్తే
– అయినా ఎక్కడా వినిపించని ఆ పేరు
అదానీ గ్రూప్స్.. ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు గౌతమ్ అదానీ. ఆ గ్రూప్ సంస్థలన్నింటికీ కర్త, కర్మ, క్రియ అన్ని ఆయనే అంటారు. కానీ దీని వెనుక ఓ అదృశ్య వ్యక్తి ఉన్నట్టు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ రహస్య వ్యక్తికి అదానీ కంపెనీల్లో ఎలాంటి అధికారిక హోదా ఉండదు. కానీ తెర చాటున ఉండి కథ నడిపిస్తారు. కంపెనీ విస్తరణలో ఆయనదే కీ రోల్. అదానీ గ్రూపు సంస్థల్లో గౌతమ్ అదానీ తర్వాత ఆయన కీలక మైన వ్యక్తి…అయినా ఎక్కడా పేరు వినపడదు. అతనే వినోద్ అదానీ.
వినోద్ అదానీ గురించి చాలా వరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో ఆయన పేరు దాదాపు ఎక్కడా కనిపించదు. చూడటానికి ఓ సాధారణ వ్యక్తిలా కనిపించినా అదానీ గ్రూప్‌లో మాత్రం ఆయన చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కానీ ఎక్కడా ఆయన పేరు వినిపించదు. అలాంటి వ్యక్తి పేరును తాజాగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలుగులోకి తీసుకు వచ్చింది.
అదానీకి చెందిన షెల్(డొల్ల) కంపెనీల వ్యవహారాలను వినోద్ చూసుకుంటారని హిండెన్ బర్గ్ వెల్లడించింది. గౌతమ్ అదానీతో వినోద్ ఎక్కువగా రహస్య లావాదేవీలు జరుపుతుంటారని పేర్కొంది. మరో వైపు ఫోర్బ్స్ పత్రిక కూడా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. వినోద్ తాను పరోక్షంగా అధికారాలు చెలాయించే సింగపూర్ కు చెంది ఓ కంపెనీకి అదానీ గ్రూప్ ప్రమోటర్ స్టాక్స్ ను ష్యూరిటీగా పెట్టి రష్యా బ్యాంకు నుంచి రుణాలు పొందినట్టు కథనంలో తెలిపింది.
పలు దేశాల్లో రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో వెల్లడించని పలు డొల్ల కంపెనీల ద్వారా అదానీ గ్రూప్స్ విస్తరణలో వినోద్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఫోర్బ్స్ చెప్పింది. మరోవైపు బ్లూమ్ బర్గ్ కూడా కీలక విషయాలను వెల్లడించింది. ఆగస్టు 2022లో అదానీ గ్రూప్ 10.5 బిలియన్ డాలర్లతో రెండు సిమెంట్ కంపెనీలను కొనేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.
ఆ సమయంలో అదానీ గ్రూప్స్, దాని బ్యాంకులు కొన్ని కీలక విషయాలను ఫైలింగ్స్ లో పేర్కొన్నట్టు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం…. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, దుబాయ్‌లలో రిజిస్టర్ చేయబడిన ఏడు అన్ లిస్టెడ్ కంపెనీలను అదానీ గ్రూప్ ఫైలింగ్స్ లో పేర్కొంది. వాటన్నింటికీ ఒక దానితో మరొకదానికి అంతర్గత సంబంధాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సిమెంట్ కంపెనీ షేర్లను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసినట్టు వివరించింది.
కానీ ఏడు సంస్థల అంతిమ లబ్ధిదారునిగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పేరు లేకపోవడం గమనార్హం. ఆయనకు బదులుగా లాభదాయక యజమానిగా ఆయన సోదరుడు వినోద్, వినోద్ భార్య రంజన్‌బెన్ అని ఉండటం విశేషం. దీని బట్టి చూస్తే అదానీకి, వినోద్ కు మధ్య సంబంధాలు అర్థం అవుతోందని స్పష్టం చేసింది.
బ్లూమ బర్గ్ నివేదిక ప్రకారం… గత కొన్నేండ్లుగా వినోద్ దుబాయ్‌లో పని చేస్తున్నారు. ఫైలింగ్స్ లో సైప్రస్ జాతీయుడిగా పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ తన షేర్లలో 140 బిలియన్ల డాలర్ల నష్టాన్ని చవి చూసింది. అదే సమయంలో వినోద్ సంపద 1.4 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 1 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
అదానీ గ్రూపులో వినోద్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారని, అదానీ కంపెనీ విస్తరణకు వినోద్ తెర వెనుక వ్యూహాలు రచిస్తారని అన్నది. కానీ అదానీ కంపెనీ మాత్రం హిండెన్ బర్గ్ నివేదికను ఖండించింది. వినోద్ కు తన సంస్థల్లో ఎలాంటి అధికార హోదా లేదని స్పష్టం చేసింది. తమ సంస్థ రోజు వారీ కార్యకలాపాల్లో వినోద్ కు ఎలాంటి సబంధం ఉండదని తేల్చి చెప్పింది. వినోద్ ఎలాంటి వ్యాపారాలు చేస్తారనే విషయంలో తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమంది.