లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రౌజ్ ఎవెన్యూ కోర్టు మరి కొద్దిగంటల్లో తీర్పునివ్వనుంది. ఆయన 5 రోజుల సిబిఐ కస్టడీ నిన్నటితో ముగిసింది. తనను ఇంకా కొంతకాలం కస్టడీలో ఉంచినా ప్రయోజనమేమీ ఉండదని ఆయన తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే తిరిగి ఎప్పుడు పిలిచినా తాను సిబిఐ ముందు హాజరవుతానన్నారు. ఈ కేసులో ఇతర నిందితులకు ఇదివరకే బెయిల్ మంజూరైందని తెలిపారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా నేను ప్రధానమైన రాజ్యాంగబధ్ద పదవిలో ఉంటూ వచ్చానని, సమాజంలో తనకు పేరు ప్రతిష్టలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
గత ఫిబ్రవరి 26 న ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా మొదట సుప్రీంకోర్టును కోరినా.. కోర్టు తిరస్కరించింది.
ఆయనను రౌజ్ ఎవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు హాజరు పరచనున్న సందర్భంగా ఈ సంస్థ కార్యాలయం బయట ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా సీఆర్ఫీఎఫ్ బలగాలను కూడా పెద్ద సంఖ్యలో మోహరించారు. గతవారం సిసోడియా రాజీనామా చేశారు.