ఎంతో ప్రతిష్టాత్మకంగా, మొదటిసారి తన పేరుతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన కేసీఆర్ కిట్ పథకం ఆగిపోనుందా…? పథకం కింద ఇవ్వాల్సిన డబ్బు గర్భిణులకు చేరటం లేదా…? కిట్‌తో సర్కార్ ఆసుపత్రులకు గర్భిణులు క్యూకడుతున్నారన్న మంత్రుల మాటలు ప్రగల్భాలేనా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ తోడుంటారు, వారి మంచి చెడు చూడటమే కాదు… వారికి సహయం కూడా చేస్తారు అంటూ గొప్పలు చెప్పుకున్న తెలంగాణ సర్కార్ కేసీఆర్ కిట్‌కు నిధులు ఇవ్వటం లేదు. దాదాపు 16 వస్తువులతో కిట్ ప్రభుత్వమే ఇస్తుందని, తల్లి-బిడ్డను సురక్షితంగా ఇంట్లో ఉచితంగా దిగబెట్టి వస్తుందని ఇటీవల ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఓ ఎమ్మెల్యే అయితే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ఇంట్లో పిల్లలు పుడితే ఏ కంపెనీ వస్తువులయితే వాడుతున్నారో… కేసీఆర్ కూడా అవే వాడమని ఆదేశాలిచ్చి, కిట్‌ను రూపోందించారని డైలాగ్‌లు చెప్పారు.
కానీ తీరా చూస్తే… నిధుల లేమితో కేసీఆర్ కిట్ పథకం నీరుగారి పోతుంది. ఇప్పటికే దాదాపు 170కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ప్రతి మూడు నెలలకు ఓసారి నాలుగు విడతలుగా గర్భిణీ స్త్రీల అకౌంట్లలో నాలుగు వేల చొప్పున జమ కావాల్సిన వాయిదాలు కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో గర్భిణీ స్త్రీలు కూడా మాకు డబ్బులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే… కిట్‌లో వచ్చే 16రకాల వస్తువులు, కిట్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది.
ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణలో… కేసీఆర్‌కు గర్భిణీ స్త్రీలకు పైసలివ్వటానికి కూడా చేతులు రావటం లేదా మేము కూడా ఏ ధర్నానో, సమ్మె చేయాలేమో అంటూ గర్భిణీ స్త్రీలు మండిపడుతున్నారు. అయితే… ఈ విడతల వారిగా చెల్లించే బకాయిలలో సైతం చాలా వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేవే ఉంటాయి. కేంద్రం కూడా గర్భిణీ స్త్రీ సంక్షేమం, మెరుగైన పౌష్టికాహరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొంత మొత్తాన్ని అందిస్తుంది. మరీ ఆ నిధులు ఎక్కడకు వెళ్లినట్లో కూడా తెలియని పరిస్థితి ఉంది.
మరీ కేసీఆర్ తన పేరుపైనే తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకానికి నిధులు విడుదల చేయించి…గర్భిణీ స్త్రీలను ఆదుకుంటారో, అన్ని పథకాల్లాగే కేసీఆర్ కిట్ పథకానికి కూడా నిధులు లేవని పక్కన పెడతారో చూడాలి.