వకీల్ సాబ్ టైమ్ లో టికెట్ రేట్లు తగ్గించింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం దృష్టిలో అది యాధృచ్ఛికమే కావొచ్చని కొందరన్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం దాన్ని కక్షసాధింపు చర్యగా చెప్పుకొచ్చారు. అప్పట్నుంచి రగులుతున్న థియేటర్ల ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు భీమ్లానాయక్ రిలీజ్ కు రెడీ అయింది. ఈసారి మాత్రం పిక్చర్ క్లియర్. ప్రభుత్వం కావాలనే పవన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లూ టికెట్ రేట్లను చూసీచూడనట్టు వదిలేసిన ఏపీ ప్రభుత్వం.. సరిగ్గా భీమ్లానాయక్ విడుదల టైమ్ కు థియేటర్లకు నోటీసులిస్తోంది. ఇంతకుముందు విడుదల చేసిన జీవో-35 ప్రకారమే నడుచుకోవాలని, తక్కువ రేట్లకే టిక్కెట్లు అమ్మాలని నోటీసులు ఇస్తోంది.
నిజానికి ఈపాటికి ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ సద్దుమణగాలి. ఎందుకంటే, ఈమధ్యే చిరంజీవి, ప్రభాస్, మహేష్ తో పాటు పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. సమస్యను పరిష్కరించారు. త్వరలోనే కొత్త జీవో వస్తుందంటూ బయటకొచ్చి ప్రకటనలు చేశారు. అలా టికెట్ రేట్లు పెరుగుతాయని టాలీవుడ్ ఆశించింది.
జగన్ సర్కారుకు కూడా వెంటనే కొత్త జీవో విడుదల చేయాలని ఉంది. కాకపోతే అలా విడుదల చేసిన జీవోతో లబ్ది పొందిన మొట్టమొదటి సినిమాగా భీమ్లానాయక్ నిలవడం వాళ్లకు ఇష్టం లేదు. అందుకే భీమ్లానాయక్ వరకు పాత జీవోనే అమలు చేయాలని నిర్ణయించారు. తాజా సమాచారం ప్రకారం.. భీమ్లానాయక్ విడుదలైన వారం రోజులకు కొత్త జీవో వచ్చే అవకాశం ఉంది.
సో.. ఈసారి కూడా పవన్ సినిమాకు ఏపీ నుంచి భారీ వసూళ్లు రావడం అసాధ్యమని తేలిపోయింది. ఉన్నంతలో వకీల్ సాబ్ తో పోలిస్తే, భీమ్లానాయక్ కు కలిసొచ్చిన అంశం ఏదైనా ఉందంటే, అది వంద శాతం ఆక్యుపెన్సీ మాత్రమే. ఏపీలో కరోనా ఆంక్షల్ని సడలించడం భీమ్లాకు ఇలా కలిసొచ్చింది.