భారత ప్రధాని నరేంద్ర మోడీ మాృతమూర్తి హీరాబెన్ మృతి పట్ల పలు దేశాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. హీరాబెన్ మృతికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. మాతృమూర్తిని కోల్పోవడం కంటే మించిన నష్టం మరొకటి ఉండదని ఆయన అన్నారు.
మాతృవియోగంతో దు:ఖంలో ఉన్న ప్రధాని మోడీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ప్రధాని తల్లి మృతికి జపాన్ ప్రధాని ఫుమియో కిషిడ కూడా సంతాపం తెలిపారు. హీరాబెన్ ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
నేపాల్ నూతన ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ కూడా ప్రధాని మోడీకి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని తాను కోరుకుంటున్నట్టు వెల్లడించారు. నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబ కూడా మీరాబెన్ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆమె ఆత్మకు మోక్షం సిద్ధించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
శ్రీలంక మాజీ ప్రధాని మహేంద్ర రాజపక్స కూడా ప్రధాని తల్లి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాతృమూర్తిని కోల్పోవడం తీరని లోటని అన్నారు. మోడీ, ఆయన కుటుంబ సభ్యులు ఈ దుఃఖం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.