రిజిస్ట్రేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోని నాలుగు ఆదివారాలు, రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్లు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈనెలలో ప్రతిరోజూ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఒక్క మహాశివరాత్రి ( మార్చి 11), హోలీ ( మార్చి29) మినహా అన్ని రోజులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు తెరిచే ఉంటాయి.
రిజిస్ట్రేషన్‌ల దరఖాస్తులు భారీగా రావడానికి తోడు ఈ నెలతో ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తుండటంతో అన్ని ఆదివారాలు, రెండవ శనివారం పనిచేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చేవాటిలో రిజిస్ట్రేషన్లు, మద్యం అగ్రస్థానంలో ఉంటాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన ఆర్థిక లోటును ఈ రకంగా పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.