కొత్త వ్యవసాయ చట్టాల రద్దు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. తీవ్రమైన చలి, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రైతులు ఆందోళన కొనసాగిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో వారు పడుతున్న ఇబ్బందులను తాము ఆర్థం చేసుకోగలమని చెప్పింది. రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉండటంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాగా చర్చలు అర్థవంతంగా సాగుతున్నాయని.. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీం దృష్టికి తెలిపారు. అయితే చర్చలు సరైన మార్గమేనని అభిప్రాయపడిన న్యాయస్థానం.. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.
గతంలోనూ ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరపింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచింది. అలాగే ఈ సమస్య పరిష్కారానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది.
ఇదిలా ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈనెల 8న మరోసారి కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. కేంద్రం వైఖరికి నిరసనగా ఆందోళననను మరింత ఉధృతం చేసేందుకు సిద్దమవుతున్నాయి. జనవరి 26న కిసాన్ పరేడ్ పేరుతో భారీ ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.