కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు అంసంతృప్తి వ్యక్తం చేశాయి. దేశంలో ధరల పెరుగుదలను, నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. దేశ ప్రజలకు ఆదాయమే సరిగా లేదని ఆయన మండిపడ్డారు.
అలాంటప్పుడు మినహాయింపులతో ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతారని ఆయన ప్రశ్నించారు. పేదలకు కేవలం హామీలు, మాటలు మాత్రమే మిగిలాయని ఎంపీ గౌరవ్ గొగోయ్ ఫైర్ అయ్యారు. ఈ బడ్జెట్ కేవలం బడా పారిశ్రామికవేత్తలకే లబ్ధి కలిగించేలా వుందని విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, కర్ణాటకకు బడ్జెట్‌లో భారీ కేటాయింపులు జరిగాయని ఇతర రాష్ట్రాల నేతలు ఫైర్ అవుతున్నారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు మధ్యలో ఉన్న మహారాష్ట్రకు బడ్జెట్‌లో ఏమీ కేటాయించలేదని శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది విమర్శించారు.
మరోవైపు ఈ బడ్జెట్ కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూర్చేలాగా ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. దేశానికి మేలు కలిగేలా బడ్జెట్ ఉండి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.