నిర్మాతకు ఆటుపోట్లు సహజం. ఓ సినిమాలో డబ్బులొస్తాయి, మరో మూవీలో పోతాయి. నష్టాలు చూడని నిర్మాత టాలీవుడ్ లో కనిపించడు. కానీ.. మైత్రీ మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థ దీనికి అతీతం. లాంఛ్ అయినప్పట్నుంచి ఇప్పటివరకు తీసిన ఏ సినిమాలో నష్టాలు చూడలేదు ఈ సంస్థ. ఈ మాట మేం చెప్పడం లేదు. స్వయంగా ఆ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ చెబుతున్నాడు.
“వంద కోట్లు పెట్టి సర్కారువారి పాట లాంటి సినిమాలు తీశాం. 50 కోట్లు పెట్టి అంటే సుందరానికి లాంటి సినిమాలు తీశాం. 5 కోట్లు పెట్టి హ్యాపీ బర్త్ డే లాంటి సినిమాలు కూడా తీశాం. బడ్జెట్ ఎంత అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. దర్శకుడితో, యూనిట్ తో సింక్ ఉందా లేదా అనేది ముఖ్యం. ఆ సింక్ కుదిరితే బడ్జెట్ ఎంత పెట్టినా టెన్షన్ ఉండదు. ఇప్పటివరకు మైత్రీ మూవీ మేకర్స్ పై తీసిన ఏ సినిమాతో మాకు డబ్బులు పోలేదు” అని చెప్పాడు.
నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమాకు థియేటర్లలో మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో ఆక్యుపెన్సీ పెరగలేదనే విషయాన్ని రవిశంకర్ అంగీకరించాడు. అయినప్పటికీ సినిమా కూడా తమకు ప్రాఫిట్ వెంచర్ అయిందని చెప్పుకొచ్చాడు. ఎవరైతే థియేటర్లలో అంటే సుందరానికి సినిమా చూడలేదో, వాళ్లంతా రాబోయే రోజుల్లో ఓటీటీలో చూసి కచ్చితంగా మెచ్చుకుంటారని తెలిపాడు.
నానితో కలిసి ఓ మంచి సినిమా తీశామనే తృప్తి తమకు ఉందని చెప్పుకొచ్చాడు రవిశంకర్. ఎప్పుడైనా తమ సంస్థ దర్శకుడి విజన్ మీద నమ్మకం పెట్టుకుందని, ఇప్పటివరకు ఆ నమ్మకం వమ్ము కాలేదని అన్నాడు.