ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నష్టం జరిగేలా ఏం మాట్లాడలేదని అన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వాటర్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్ కు నష్టం జరగదని స్పష్టం చేశారు.
వెంకట్ రెడ్డి నష్టం జరిగేలా ఏమీ మాట్లాడలేదని అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడింది ఒకటైతే.. మీడియాలో మరొకటి వచ్చిందన్నారు. దీంతో ప్రజలకు ఇంకోలా అర్థం అయిందని చెప్పారు. ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిశానన్న ఆయన.. రాజకీయ అంశాలపై చర్చించినట్లు చెప్పారు.
ఠాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలను ఏ విధంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేశామన్నారు. ఠాక్రేతో భేటీలో పార్టీ అంతర్గత విషయాలేవీ చర్చకు రాలేదని తెలిపారు.
తెలంగాణలో 70 సీట్లు సాధించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ బలం, బలహీనతను ఠాక్రేకు వివరించానన్న ఆయన.. చాలా మంది సీనియర్ లు పాదయాత్ర షెడ్యూల్ ఇచ్చారని, తన రూట్ మ్యాప్ ను కూడా త్వరలోనే ప్రకటిస్తానని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.