గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు మంగళవారం మళ్లీ నోటీసులు జారీ చేశారు. ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనవద్దని రాజాసింగ్ పై బెయిల్ షరతులు ఉండగా షరతులు ఉల్లఘించారని నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే రాజాసింగ్ షరతులు ఉల్లఘించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ముంబైలో జరిగిన సభలో మతపరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపించారు. తెలంగాణ పోలీసులు రాజాసింగ్ పై ఇటీవల పీడీయాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో షరతులతో ఇటీవల రాజాసింగ్ విడుదలయ్యారు. మళ్లీ మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు. ఈ విషయమై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఇక,పోలీసుల నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాజాసింగ్ మంగళవారం మీడియా మాట్లాడుతూ..నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిప్డడారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా, జైలుకు పంపినా భయపడేది లేదన్నారు. ధర్మం కోసం చావడానికైనా సిధ్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను, గో హత్య,మతమార్పిడులు, లవ్ జిహాద్ పై చట్టం చేయాలని కోరాను అన్నారు. ఇందులో మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. ముంబైలో పాల్గొన్న కార్యక్రమంలో మాట్లాడితే నాకు తెలంగాణ పోలీసులు నోటీసులిచ్చారని రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.