అధికార వైసీపీ ఇంకా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. మా బావ కాకాణి గోవర్థన్ రెడ్డి నాలుగు ప్రశ్నలు అడిగితే 40 తిట్లు తిట్టారని..ఆయన తిట్లకు మళ్లీ సమాధానం చెబుతున్నానని అన్నారు కోటం రెడ్డి. నాకు ఉన్న నలుగురు గన్ మెన్ లలో ఇద్దరిని తొలగించారని ఆయన మండిపడ్డారు.
అయితే పోలీస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో తెలియదన్నారు ఆయన. తనకు చాలా చోట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేశారని ఫైర్ అయ్యారు కోటం రెడ్డి. నాకు గన్ మెన్లు తగ్గించిన సర్కార్ కు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని.. ఇద్దరు గన్ మెన్లను తొలగించారు,మిగిలిన ఇద్దరు గన్ మెన్లు నాకొద్దని కోటం రెడ్డి కౌంటర్ వేశారు జగన్ సర్కార్ కు.
నాకు గన్ మెన్లను తగ్గించినంత మాత్రాన నేను భయపడనని అన్నారు. నాగొంతు పెరిగేదే తప్ప తగ్గేది లేదన్నారు ఆయన. నాకు ఇప్పుడు ఉన్న ఇద్దరు గన్ మెన్ లను కూడా తిప్పి పంపుతున్నా అని చెప్పారు. వారిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నా అని అన్నారు. నాకు గన్ మెన్ లు అక్కర్లేదన్నారు. నన్ను ఏమైనా చేసుకోండని, రోజురోజుకూ నాగొంతు వినిపిస్తూనే ఉంటా అని, ఎంత దూరమైనా వెళతానన్నారు కోటం రెడ్డి. గన్ మెన్ లను తొలగించినంత మాత్రాన నన్ను మానసికంగా ఏమీ చేయలేరన్నారు.
తగ్గేదేలే..అన్న ఆయన నా మీద మంత్రులతో విమర్శల దాడి చేయిస్తున్నారన్నారు. ఒక ఎమ్మెల్యే ని ఒంటరి వాడిని చేసి విమర్శిస్తున్నారన్నారు. ఏ.ఎస్.పి పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. గన్ మెన్ లను తీయలేదని అంటున్నారని..నిన్ననే ఇద్దరిని తీసేసి.. అయినా తొలగించలేదని చెప్పడం సరికాదని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.