ఇంటింటికి మంచినీరు ఇచ్చి తీరుతాం. లేదంటే ఓట్లు అడగం అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గతంలో సవాల్ చేశారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లి గెలిచి కూడా సంవత్సరం దగ్గరకు వస్తోంది. అయినా మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదు. ఇదేదో ప్రతిపక్ష నేతనో, మరోకరో అన్న మాటలు కావు. స్వయంగా కేసీఆర్ సర్కార్‌లో మంత్రే మా ఊరికే నీళ్లు రావటం లేదంటూ కామెంట్ చేశారు.
అధికారుల అలసత్వం అని నాయకులు, కాంట్రాక్టర్ల తప్పులని అధికారులు… ఒకరిపై ఒకరు నిందలేసుకున్నా, మిషన్ భగీరథ పూర్తికాలేదని మరోసారి బయటపడింది. రక్షిత మంచినీటిని ప్రతి ఇంటికి ఇస్తాం అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ సర్కార్, ఆ దిశగా 100శాతం సక్సెస్ కాలేదని రుజువయ్యింది. స్వయంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… మా ఊరికే ఇంకా నీళ్లు రావటం లేదంటూ అధికారులు, మీడియా ముందే వ్యాఖ్యానించటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించిన మంత్రి, పనులు పూర్తికాకపోవటం… ఇంటింటికి నల్లా కలెక్షన్లు ఇవ్వకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, వర్కింగ్ ఏజెన్సీలతో త్వరగా పని పూర్తి చేయించకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.
దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు ఇంకా రావటం లేదని ఎంతో కాలంగా విమర్శిస్తున్నా స్పందించలేదని ఇప్పుడు స్వయంగా కేసీఆర్ మంత్రివర్గంలోని మంత్రే తన ఊరికి నీళ్లు రావటం లేదని వ్యాఖ్యానిస్తున్నారని, దీనికి కేసీఆర్, కేటీఆర్ ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు.