దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. ఇటీవల దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా తగ్గుముఖం పడుతున్నందున దేశంలో కరోనా ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలో మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను ఎత్తి వేయనున్నట్టు ప్రకటించింది.
కానీ ఫేస్ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మాత్రం తప్పని సరిగా చేయాలని కేంద్రం సూచించింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది.
దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం- 2005 ప్రకారం మార్గదర్శకాలు, ఆదేశాలను 24 మార్చి 2020లో తొలిసారిగా కేంద్ర జారీ చేసింది. ఆ తర్వాత కొవిడ్ పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాల్లో మార్పులు చేస్తూ వచ్చింది.
‘ గత రెండెండ్లలో కొవిడ్ నిర్వహణకు సంబంధించి రోగ నిర్ధారణ, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, టీకా వంటి వివిధ అంశాలకు సంబంధించి మన సామర్థ్యాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి’ అని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇటీవల తమ సామర్థ్యాలను, వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాయి. కొవిడ్ కట్టడికి అవి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించుకున్నాయి. కొవిడ్ కట్టడికి ఎలాంటి నిబంధనలు పాటించాలో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున అవగాహన పెరిగింది.
‘ ఇక ఇటీవల కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. వీటన్నింటితో పాటు మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ సంసిద్దతను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం లేదని జాతీయ విపత్తు నిర్వాహణ అథారిటీ నిర్ణయం తీసుకుంది’ అని లేఖలో పేర్కొన్నారు.