పాకిస్తాన్ ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ కి టర్కీ ఝలక్ ఇచ్చింది. భూకంప విలయంతో తల్లడిల్లుతున్న ఈ దేశానికి సంఘీభావ సూచకంగా వచ్చేందుకు సిద్ధమైన ఆయనకు షాకిచ్చింది. తమ మంత్రులంతా భూకంప బాధితులకు సహాయం అందించే చర్యల్లో నిమగ్నమై ఉన్నారని, అందువల్ల ఇప్పుడు మీరు రానవసరం లేదని స్పష్టం చేసింది. నిజానికి షరీఫ్, తమ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోతో కలిసి ఈ నెల 8 న టర్కీని విజిట్ చేయాలనుకున్నారు. అయితే చివరి క్షణంలో టర్కీ నుంచి ఈ సమాచారం అందడంతో తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇది పాక్ ప్రధానికి పెద్ద ఇరకాటమే.
. ఊహించని సమాచారాన్ని అందుకున్న ఆయన బిత్తరపోయారు. సోమవారం సంభవించిన భూకంప విలయంతో టర్కీ, సిరియా దేశాలు ఇప్పటికీ విలవిలలాడుతున్నాయి. నేలమట్టమైన శిథిలాల్లో నేటికీ వేల కొద్దీ మృతదేహాలు పడివున్నాయి. అనేకమంది గాయాలతో తల్లడిల్లుతున్నారు. సహాయక బృందాలు రక్షణ చర్యల్లో తలమునకలై ఉన్నాయి. రోజు రోజుకీ మృతుల సంఖ్య పెరగవచ్చునని భయపడుతున్నారు.
మా ప్రధాని షెహ్ బాజ్ షరీఫ్ భూకంప బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలిపేందుకు మీ దేశానికి రానున్నారని, పైగా తన టర్కీ విజిట్ కోసం ఈ నెల న జరగవలసిన ముఖ్య సమావేశాన్ని కూడా వాయిదా వేసుకున్నారని నిన్న ఉదయం పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి మరియుమ్ ఔరంగజేబ్ .. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కి సమాచారం పంపారు.
అయితే కొన్ని గంటల్లోనే మొదట మీ దేశం నుంచి మాకు సహాయ సామాగ్రి పంపాలని, పైగా వాతావరణం బాగులేని కారణంగా మీ ప్రధాని భూకంప బాధిత ప్రాంతాలను సందర్శించలేరని టర్కీ నుంచి లేఖ అందింది. మా అధ్యక్షుడు ఎర్డోగన్, ఆయన వైస్ ప్రెసిడెంట్ కూడా సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ విపత్కర సమయంలో మేం సాయం కోసం ఎదురుచూస్తున్నామని, అత్యవసరంగా సహాయ సామాగ్రిని పంపాలని ఇందులో కోరారు. అసలే ఆర్థికవ్యవస్థ కుదేలైపోయి తామే సాయానికి వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తున్న పాకిస్తాన్ కి టర్కీ నుంచి అందిన ఈ ‘కబురు’ శరాఘాతమే !