స్థానిక నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి , బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ మధ్య నెలకొన్న వర్గ విభేధాలు మరోసారి బయటపడినట్లైంది.
నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు తనకు ఆహ్వానం రావడం లేదని కడియం ఆరోపించారు. కేసీఆర్ అందరినీ కలుపుకొని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని చెబుతుంటే.. స్థానిక నాయకత్వం మాత్రం తనను పట్టించుకోకుండా.. వారిది వారే చూసుకుంటున్నారని ఆయన విమర్శించారు.
అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థికి తాను పూర్తి మద్దతు ఇచ్చి గెలుపులో భాగస్వామిని అయ్యానని ఆయన ఆవేదన చెందారు. అంతే కాదు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి సహకరించానని కడియం అన్నారు.
కాని ఇప్పుడు తనను స్టేషన్ ఘన్ పూర్ లో కాని వాడిలా స్థానిక నాయకత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉందని ఆయన మీడియా ముందు అన్నారు.