ఎమ్మార్వో విజయారెడ్డి హత్య తర్వాత అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. సురేష్ పగతో తలుపులు బిగించి పెట్రోల్ పోసి నిప్పంటించాడనే అనుకున్నా… తాను తలుపులు తెరుచుకుని మంటల భయానికి బయటికి పరుగులు పెట్టాడనే అనుకున్నా… ఎమ్మార్వో మంటల్లో కాలిపోతున్న దృశ్యాల ణ్ణంగా పరిశీలిస్తే లాజిక్ మిస్సవుతున్నట్లు కనపడుతోంది.
ఎమ్మార్వో విజయారెడ్డికి పెట్రోల్ పోసి, నిప్పు పెట్టి నిందితుడు బయటకు వచ్చాడు. మంటలు విజయారెడ్డిని దహించి వేస్తుంటే… ఆమె బయటకు వచ్చింది. తన చాంబర్ నుండి… లోపలి సెక్షన్ అధికారుల ముందు నుండి తాను మంటలతోనే బయటకు వచ్చినట్లు వీడియోలు చూస్తే అర్థమవుతోంది. ఎంత చిన్న ఎమ్మార్వో కార్యాలయం అయినా… ఎమ్మార్వో చాంబర్ బయట పదుల సంఖ్యలో జనం ఉండటం కామన్. పైగా సెక్షన్ కూడా అక్కడే ఉంటుంది. కానీ ఎమ్మార్వో దహనం అవుతుంటే… ఒక్క డ్రైవర్, అటెండర్ మినహా ఎవరూ ఎందుకు కాపాడే ప్రయత్నం చేయలేదు, మానవత్వాన్ని మరిచి వీడియోలు తీసేందుకు ఎగబడ్డారు కానీ మంటలార్పేందుకు ఒక్కరూ కూడా ఎందుకు ముందుకు రాలేదు, డ్రైవర్‌కు కనీసం సహయం చేయాలన్న సోయి ఎందుకు లేకుండా పోయిందన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంటుంది.
మంటల భయానికి కొందరు దూరంగా పరుగులు పెట్టారు అని చెబుతున్నా… వీడియో తీసే సమయంలో కాపాడే ప్రయత్నం మాత్రం జరగలేదు అన్నది వాస్తవం. ఆ చనిపోయేది ఎమ్మార్వో అని వారికి తెలుసో లేదో కానీ సాటి మనిషి మంటల్లో అగ్నికి ఆహుతి అవుతుంటే అక్కడి జనం స్పందించిన తీరు అమానవీయంగానే ఉంది. తన యజమాని చావు తప్పించబోయి తాను బలైన డ్రైవర్ గుర్నాథం నిజంగా ఆదర్శప్రాయుడే అని ఘటనను పూర్తిగా చదివిన వారు అనుకుంటున్నారు.