వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్.పి.ఆర్ (నేషనల్ పాపులేషన్ రిజస్టర్)కు మద్దతు నిస్తున్నట్టు శివసేన మంగళవారం స్పష్టం చేసింది. సీఏఏ ప్రమాదకరం కాదని, ఎన్.పి.ఆర్ అమలు ఆపివేయమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కనబెట్టి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎన్సీపీ నేత శరద్ పవార్ సీఎం వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పార్టీతో మాట్లాడి, ఏ పేజీలోనయితే ఆ వార్త వచ్చిందో అదే పేజీలో తెలియజేస్తానన్నారు.
సిందుర్గులో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ ”సీఏఏ, ఎన్.ఆర్.సి వేర్వేరు. ఎన్.పి.ఆర్ వేరు. సీఏఏ ను అమలు చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు..” ఎన్.ఆర్.సి ని మన రాష్ట్రంలో అమలు చేయడం లేదు…కేంద్రం ఇప్పటి వరకు ఎన్.ఆర్.సి గురించి చర్చించలేదు” అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం అమలు చేయమని హామీ ఇచ్చిందని చెప్పారు. ఒకవేళ ఎన్.ఆర్.సి.ని అమలు చేస్తే హిందువులు, ముస్లింలతో పాటు గిరిజనులపై కూడా ప్రభావం పడుతుందన్నారు ఉద్ధవ్ ఠాక్రే.
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సీఏఏ, ఎన్.ఆర్.సి, ఎన్.పి.ఆర్ లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఏఏ ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లింయేతరులైన హిందూ, పార్శీ, జైన్, బౌద్ద, క్రిస్టియన్, సిక్కు మతాలకు చెందిన అక్రమ వలసదారులకు పౌరసత్వం లభిస్తుంది. ఈ చట్టంతో బీజేపీ ప్రభుత్వం ముస్లింలను టార్గెట్ చేసిందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్.పి.ఆర్ అనేది ఎన్.ఆర్.సిలో మొదటి భాగమని భావిస్తున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దాన్ని అమలు చేయడం లేదు.