రష్యా నుంచి చౌక ధరలకు ముడి చమురు కొనుగోలును ఆపివేయాలని భారత్ ను ఏ దేశమూ ఆదేశించలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. తమ ప్రజలకు ఇంధన శక్తిని అందించే నైతిక బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందన్నారు.
ఇలాంటి చర్చలు భారత జనాభా పెట్రోల్ అవసరాలను తీర్చవన్నారు. అందుకే ఎక్కడి నుంచైనా చమురును కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. యూఎస్ ఇంధన సెక్రటరీ జెన్నిఫర్ గ్రాన్ హాల్మ్ తో దైపాక్షిక చర్చల అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
మీరు మీ పాలసీ గురించి స్పష్టంగా ఉన్నట్లయితే, అంటే మీరు ఇంధన భద్రత, ఇంధన స్తోమతపై నమ్మకం కలిగి ఉంటే, మీరు ఎక్కడ నుంచి ఇంధన శక్తిని కొనుగోలు చేయాల్సి వుంటుందో అక్కడి నుంచి కొనుగోలు చేస్తారని ఆయన అన్నారు.
రష్యా నుండి ఇంధన కొనుగోలుపై చాలా అపోహ ఉందన్నారు. సాధారణంగా యూరప్ ఒక మధ్యాహ్నం కొనుగోలు చేసే మొత్తాన్ని మనం త్రైమాసికంలో కొనుగోలు చేస్తున్నామన్నారు. ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి కేవలం 0.2 శాతం దిగుమతిని చేసుకున్నామని వెల్లడించారు.