ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు నిరాశ ఎదురైంది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు తగిన సహాయం అందిస్తామని కేంద్రం మొదట్లో విద్యార్థులకు హామీ ఇచ్చింది. కానీ తాజాగా విద్యార్థుల విషయంలో కేంద్రం చేతులెత్తేసింది.
దేశంలోని కళాశాలల్లో వారికి అడ్మిషన్లు కల్పించలేమని తాజాగా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల గురించి గతంలో లోక్ సభలో కేంద్రాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రశ్నించారు. దీనికి తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయా బదులిచ్చారు. ఈ మేరకు వివరాలతో ఎంపీకి కేంద్ర మంత్రి లేఖ రాశారు.
విదేశాల్లో ప్రవేశాలు పొంది అక్కడ కొంత మేరకు వైద్య విద్య పూర్తి చేసిన విద్యార్థులకు దేశంలోని కళాశాలల్లో ప్రవేశాలు కల్పించలేమని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956, నేషనల్ మెడికల్ యాక్ట్ 2019 ప్రకారం ఇందుకు అనుమతించదని చెప్పారు.
ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో వైద్య విద్య పూర్తి చేయలేకపోయిన చివరి సంవత్సరం విద్యార్థులకు కంబైన్డ్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షలో పాస్ అయిన వారు దేశంలో రెండేళ్లపాటు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.