2024 ఎన్నికల్లో విపక్షాల ప్రధాన మంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తే అభ్యంతరం లేదని బీహార్ సీఎం, జేడీ-యు చీఫ్ నితీష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో తమ మిత్ర పక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉందని, అందువల్ల రాహుల్ ని పీఎం అభ్యర్థిగా చేస్తే తమకు సమస్యయేమీ లేదని ఆయన చెప్పారు. ఈ పదవిని తాను ఆశించడంలేదని పునరుద్ఘటించారు.
అయితే ఈ కొత్త ప్రత్ఝిపాదనపై భావ సారూప్యం గల పార్టీలన్నింటిలో ఏకాభిప్రాయం వ్యక్తం కావలసి ఉందన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ ప్రధాన మంత్రి అభ్యర్థి అని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ ఇదివరకే ప్రకటించారు. దీనిపై ఆ పార్టీయే అన్ని పార్టీలను కలుపుకుని పోవలసి ఉంటుందని, ప్రస్తుతం ఆ పార్టీ (కాంగ్రెస్) భారత్ జోడో పాద యాత్రలో బిజీగా ఉందని నితీష్ కుమార్ అన్నారు.
ఇదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలను ఒక్క తాటిపైకి తేవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సుమారు 5 నెలల క్రితం బీజేపీతో కటీఫ్ చెప్పిన ఈ నేత.. ప్రపంచ చరిత్రలో ఎవరూ రాహుల్ మాదిరి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టలేదన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం లా మరే కుటుంబమూ త్యాగాలు చేయలేదన్నారు.
కమల్ నాథ్ కూడా ఇటీవలే ఇలాగే వ్యాఖ్యానించారు. రాహుల్ పీఎం అభ్యర్థి ప్రతిపాదన మెల్లగా చర్చల్లోకి వస్తోందని అంటున్నారు. మొదట కమల్ నాథ్ దీనిపై ప్రస్తావించగా.. తాజాగా నితీష్ కుమార్ కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో జేడీ-యు వర్గాలు కూడా తమలో తాము ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని సంప్రదింపులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.