కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేశామని బీజేపీ సర్కార్ చెబుతోందన్నారు. కానీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపినట్టు ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలు మాట్లాడితే సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతారని ఆయన అన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్‌లో ఎంతో మంది ఉగ్రవాదులను మట్టుపెట్టామని పేర్కొంటారని, కానీ వాటికి ప్రూఫ్స్ మాత్రం ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వం అబద్దాలతో పాలన నడిపిస్తోందన్నారు. పుల్వామాలో ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోడీపై దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సీఆర్పీఎఫ్‌పై దాడి చేసిన వాహనాన్ని సరిగ్గా తనిఖీ చేసి ఉంటే 2019 ఉగ్రదాడిని అడ్డుకుని ఉండే వాళ్లమని పేర్కొన్నారు. వారంతా ఎందుకు చనిపోయారు. ఆ ఏరియా సున్నితమైన ప్రాంతం కావడంతో సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేయాలని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ కోరారన్నారు.
కానీ దాన్ని ప్రధాని మోడీ తిరస్కరించారని చెప్పారు. ప్రధాని మోడీ ఎందుకు తిరస్కరించారని ఆయన ప్రశ్నించారు. ఉగ్రచర్యలకు పుల్వామా కేంద్రంగా మారిందన్నారు. అలాంటి ప్రాంతంలో అన్ని వాహనాలను పూర్తిగా తనిఖీ చేయాలన్నారు. కానీ ఆరోజు స్కార్పియో వాహనాన్ని ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు పార్లమెంట్‌లో వెల్లడించలేదన్నారు. దాని గురించి ప్రజలకు పెద్దగా సమాచారం లేదన్నారు. 2019 ఫిబ్రవరి 14న పూల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. అందులో 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.