జీహెచ్‌ఎంసీలో జీతాల్లేవ్ - Tolivelugu

జీహెచ్‌ఎంసీలో జీతాల్లేవ్

రాష్ట్రంలోని అతి ఖరీదైన కార్పోరేషన్. వేలమంది ఉద్యోగులు… లక్షల మంది ప్రజలు. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సంపాదించిపెట్టే హైదరాబాద్ నగరం. కానీ ఇక్కడే ఖజానా ఖాళీ అయింది. ఎంతగా అంటే… తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగ దసరాకు బోనస్‌ ఇవ్వాల్సిందిపోయి… ఇంతవరకు జీతాలే వేయలేదు.

అవును. జీహెచ్‌ఎంసీలో ఈ నెల ఇంతవరకు జీతాలు పడలేదు. తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగా… ఇంతవరకు జీతాలు వేయలేదు జీహెచ్‌ఎంసీ. ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు పడుతుంటాయి కానీ ఈ నెల ఇప్పటి వరకు జీతాలు వేయలేని దుస్థితి నెలకొంది. దాంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది, కార్మికులు లబోదిబోమంటున్నారు. దసరా పండుగకు బోనస్‌ వస్తుందనుకుంటే… ఉన్న జీతం కూడా రాలేదంటు మండిపడుతున్నారు.

అయితే, గ్రేటర్‌ పరిధిలో వసూళ్లు బాగానే ఉన్నా… అంచనాలకు మించి ముందే ఖర్చులు పెట్టేశారని, ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారని… దాంతో ప్రతినెలా వడ్డీల భారం కూడా పెరిగిపోతుందని తెలుస్తోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) గల్లా పెట్టె ఖాళీ అయింది. ప్రతి నెలా వందల కోట్ల రూపాయల జమా ఖర్చులను నిర్వహించే బల్దియా.. కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. బల్దియాలో నిధుల కొరత లేదని స్వయాన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమారే వెల్లడించారు. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలందేవి. కానీ, అక్టోబర్‌ వేతనాలు ఇంకా ఖాతాల్లో జమ కాలేదు.

జీహెచ్‌ఎంసీలో 2018-19 సంవత్సరానికి 3900 కోట్ల వరకు ఖర్చు చేశారు. కానీ ఆదాయం 3వేల కోట్లకు మించలేదని తెలుస్తోంది. పైగా అప్పులకు చెల్లించే వడ్డీ ప్రతినెలా 10కోట్లకు పైమాటే. ఇక కేటీఆర్‌ ప్రారంభించిన ఎస్సార్డీపీ ప్రాజెక్టుకు 400కోట్లు, రోడ్ల మరమ్మత్తులకు 900కోట్లు, శానిటేషన్‌ కోసం 800 కోట్లు ఖర్చవుతున్నాయి. ఇక రెగ్యూలర్ సహా ఇతర సిబ్బంది వేతనాలు… పెన్షన్‌లు, విద్యుత్‌ అంశాలు అన్నీ కలిపి 130కోట్లకు పైగానే జీహెచ్‌ఎంసీ చెల్లించాల్సి వస్తోంది. ఇక ఇతర వ్యయాలకు తక్కువలో తక్కువగా 70కోట్లకు పైగానే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

దాంతో జీహెచ్‌ఎంసీ పరిస్థితి దయనీయంగా తయారైనట్లు తెలుస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ… కొంతకాలంగా ఇదే పరిస్థితి ఉన్నా, జీతాలకు ఎలాగోలా సర్ధుబాటు చేశారు కానీ… ఈ నెలకు సర్దుబాటు చేయటం తలకు మించిన భారం అయినట్లు సమాచారం.

అయితే, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందించలేని పరిస్థితి బల్దియా చరిత్రలో మొదటిసారి అంటూ పలువురు ఉద్యోగులు అన్నారు. ఈ క్రమంలో సోమవారం ఒక్కరోజే భారీగా పన్ను వసూలు చేశారు. ఆ మొత్తంతో కొన్ని విభాగాల ఉద్యోగులకు వేతనాలు వేశారు.

ఇక జీహెచ్‌ఎంసీకి కీలకమైన ఆదాయ మార్గల్లో ప్రాపర్టీ టాక్స్ కీలకం. అందుకే జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రాపర్టీ టాక్స్‌ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రతినెలా 80కోట్ల వరకు వసూలు అవుతుండగా, ఈ నెల జీతాల సర్ధుబాటు కోసం ఒక్కరోజే 28.50కోట్లను వసూలు చేశారంటే… అర్థం చేసుకోవచ్చు ఎంతలా జీహెచ్‌ఎంసీ ప్రాపర్టీ టాక్స్‌ పై ఆధారపడిందో. ఇక వసూలు అయిన డబ్బు వసూలు అయినట్లు జీతాలు చెల్లిస్తుందని… అందుకే ప్రతి రోజుకు, రెండు రోజులకోసారి కొంతమందికి జీతాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

కానీ బాండ్ల రూపంలో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అనేక రూపాల్లో అప్పులు తెచ్చుకుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆదుకుంటే తప్పా… ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉంటుందని, జీహెచ్‌ఎంసీని అప్పుల ఊబిలోకి నెట్టిన ప్రభుత్వమే బయటపడేయాలంటున్నారు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు.

Share on facebook
Share on twitter
Share on whatsapp