ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కలవరం మొదలైంది. చైనా, అమెరికాలతో పాటు పలు దేశాల్లో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో భారత్ లోనూ కరోనా నాలుగో వేవ్ భయం ప్రజలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ఆదేశాలను కూడా జారీ చేసింది.
ముఖ్యంగా ఎయిర్ పోర్ట్స్ లో కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. దేశంలో కొవిడ్ వ్యాప్తిని పరిశీలిస్తోంది.
కొవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలు, వ్యాక్సిన్ మొదలుకొని ఆసుపత్రుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తోంది. ఇదే సందర్భంలో దేశంలో రెండో బూస్టర్ డోస్ పై చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. కరోనా ముప్పు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి రెండో బూస్టర్ డోస్ అవసరం లేదని అభిప్రాయపడ్డాయి.
కరోనా నిరోధానికి బూస్టర్ డ్రైవ్ ను పూర్తి చేయడం ప్రభుత్వ మొదటి లక్ష్యం అని పేర్కొన్నాయి. అయితే ఇప్పటి వరకు మన దేశంలో 220.11(2,20,11,23,642) కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.