కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గకపోవడంతో.. రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు జరుగుతుండగా..ఈ విద్యాసంవత్సరానికి వార్షిక పరీక్షలు ( యాన్యువల్ ఎగ్జామ్స్) నిర్వహించే యోచనలో ఉంది. ఇప్పటికే విద్యా సంవత్సరం సగానికిపైగా పూర్తి కావడంతో.. సెమిస్టర్ విధానంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సూచించినట్టుగా తెలిసింది.
పరీక్షల నిర్వహణకు సంబంధించి త్వరలోనే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు, ఎగ్జామ్ కంట్రోలర్లతో సమావేశమై చర్చించాలని ప్రభుత్వం సూచించింది. సెమిస్టర్ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, వార్షిక పరీక్షలు నిర్వహిస్తే ఎదురయ్యే ఇబ్బందులపై విస్తృతంగా చర్చించి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది. ఈ నెల రెండోవారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ యాన్యువల్ ఎగ్జామ్ వైపే మొగ్గుచూపితే ఏప్రిల్ లేదా మే నెలలో దశల వారీగా ఆయా కోర్సులకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తారని అధికారులు చెప్తున్నారు.