ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్ పాలన చట్ట విరుద్ధంగా సాగుతుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులతో అణిచివేస్తున్నారని అన్నారు. రెండు రోజుల క్రితం లక్నోలో పోలీసులు ప్రియాంక గాంధీపై దురుసుగా ప్రవర్తించిన అనంతరం ఆమె ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన రక్షణపై ఎలాంటి ఆందోళన లేదని చెప్పిన ఆమె… భారతదేశంలో శతృత్వానికి, హింసకు, ప్రతీకారానికి తావు లేదన్నారు. గత వారం పౌరసత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న 31 మందిని పోలీసులు నిర్బంధించారని తెలిపారు.నా రక్షణ పెద్ద విషయం కాదు..నేను రక్షణ కోరుకోవడం లేదు..నేను సామాన్యుల రక్షణ గురించి మాట్లాడుతున్నాను. 5,500 మందిపై కేసులు నమోదు చేశారు. ఎంతో మందిని జైల్లో పెట్టారు. పోలీసులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతీకారం తీర్చుకుంటాన్న వ్యాఖ్యలను పోలీసులు అమలుచేస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు చట్ట విరుద్ధ చర్యలను తెలుపుతూ 14 పేజీల నివేదికను కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కు అందజేసింది.