పాకిస్తాన్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. బుధవారం జమ్మూ కశ్మీర్ లోని బారాముల్లాలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని చెప్పారు. 1990 నుంచి దేశంలోఉగ్రవాద కార్యకలాపాలకు 42వేలమందికి పైగా మరణించారని, గత ప్రభుత్వాలు వీటిని అణచివేయలేకపోయాయని అన్నారు.
’70 ఏళ్ళు ఈ దేశాన్ని పాలిచినవాళ్లు పాకిస్తాన్ తో చర్చలు జరపాలని అంటున్నారు. కానీ ఆ దేశంతో మేమెందుకు చర్చలు జరపాలి’ అని ఆయన ప్రశ్నించారు. మేం బారాముల్లా ప్రజలతో, కశ్మీర్ ప్రజలతో మాట్లాడతాం .. వీరి సమస్యలు తెలుసుకుంటాం అని అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత శాంతియుత ప్రాంతంగా కశ్మీర్ కావాలని కోరుతున్నామన్నారు.
ఈ కేంద్ర పాలిత ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి అబ్దుల్లాలు (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీలు (పీడీపీ), నెహ్రూ-గాంధీ కుటుంబాలు (కాంగ్రెస్) కారణమని ఆయన ఆరోపించారు. 1947 లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇదివరకటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని చాలాకాలం పాటు వారే పాలించారని, ప్రజలకు ఏం ఒరగబెట్టారని ఆయన అన్నారు.
మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వాలు నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే 2014 నుంచి మేము తొమ్మిది కాలేజీలు ఏర్పాటు చేశాం.. పైగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గ్రామాలతో బాటు ఇక్కడి గ్రామాలకు కూడా విద్యుత్ సౌకర్యం కల్పించాం అని అమిత్ షా చెప్పారు. ఇక ఈ ప్రాంత అభివృద్ధిని ప్రజలే చూస్తారని ఆయన పేర్కొన్నారు.