స్నిఫర్ డాగ్స్‌ను ఇండియన్ ఆర్మీ, పోలీసు విభాగం, ఇతర విభాగాల్లో ముఖ్యంగా పేలుడు పదార్థాలను గుర్తించేందుకు ఉపయోగిస్తుంటారు. వాటికి శిక్షణ ఇచ్చేందుకు ఆయా విభాగాల్లో ప్రత్యేకంగా శిక్షకులు ఉంటారు. అయితే స్నిఫర్ డాగ్స్ కేవలం పేలుడు పదార్థాలను మాత్రమే కాదు, కరోనా వైరస్‌ను కూడా గుర్తించగలవు. అవును.. కనుకనే వాటి సేవలను ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఉపయోగించుకుంటోంది.
చండీగఢ్‌లోని ట్రాన్సిట్ క్యాంపులో రెండు శునకాలకు కరోనా వైరస్‌ను గుర్తించేందుకు గతేడాది సెప్టెంబర్‌లో శిక్షణ ఇచ్చారు. అయితే అవి అనూహ్యంగా కరోనా వైరస్‌ను గుర్తించడం మొదలు పెట్టాయి. వాటి ఎదుట కరోనా వైరస్ ఉన్న పదార్థాలు లేదా వస్తువులను పెడితే చాలు అవి త్వరగా గుర్తిస్తాయి. దీంతో వాటి దగ్గర అవి నిలబడతాయి. అప్పుడు వాటిలో కరోనా ఉన్నట్లు స్పష్టమవుతుంది.
సదరు క్యాంప్ నుంచి లడఖ్, కాశ్మీర్‌లకు ఆర్మీ సిబ్బందిని ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు. అయితే గతేడాది సెప్టెంబర్ వరకు అక్కడ దాదాపుగా 20వేల మందికి కరోనా సోకింది. దీంతో వారందరికీ వేగంగా కరోనా పరీక్షలు నిర్వహించడం, కరోనా సోకిన వారిని మిగిలిన వారి నుంచి ఐసొలేట్ చేయడం కష్టంగా మారింది. అందుకనే ఆర్మీ వారు స్నిఫర్ డాగ్స్ ను రంగంలోకి దించారు. వాటికి శిక్షణ అందించి కరోనా ఉన్నవారిని సులభంగా గుర్తించగలుగుతున్నారు.
సాధారణంగా శునకాలకు కరోనా వైరస్‌ను గుర్తించేందుకు 36 వారాల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ రెండు శునకాలకు 16 వారాల్లోనే శిక్షణ ఇచ్చారు. అవి విజయవంతంగా పనిచేస్తుండడంతో త్వరలోనే మరో 8 శునకాలకు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో 10 శునకాలు ఇక ఇండియన్ ఆర్మీలో కోవిడ్‌ను గుర్తించేందుకు పనిచేయనున్నాయి. ఈ మేరకు లెఫ్టినెంట్ కల్నల్ సురీందర్ సైనీ తెలిపారు.
ఇక అనారోగ్య సమస్యలు ఉన్నవారి శరీరం నుంచి వెలువడే మలమూత్రాలు, చెమట వంటి వ్యర్థాల్లో ఒక రకమైన మెటబాలిక్ చిహ్నం ఉంటుంది. దాన్ని శునకాలు పసిగట్టగలవు. అందుకనే ఇప్పటికే కొన్ని శునకాలను మలేరియా, డయాబెటిస్, పార్కిన్సన్ వ్యాధి వంటి వ్యాధులు ఉన్నవారిని అలవోకగా గుర్తించగలవు. అందులో భాగంగానే వాటికి శిక్షణ ఇచ్చారు. దీంతో అవి కోవిడ్ పేషెంట్లను కూడా కొన్ని సెకన్లలోనే గుర్తించగలుగుతున్నాయి. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుతో అయితే కోవిడ్ ఉందా, లేదా అని కచ్చితంగా నిర్దారించేందుకు చాలా సమయం పడుతుంది. కానీ శునకాల ద్వారా అయితే ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.
కాగా ఇప్పటికే బ్రిటన్, ఫిన్‌లాండ్, రష్యా, ఫ్రాన్స్, యూఏఈ, జర్మనీ, లెబనాన్ వంటి దేశాలు ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు కరోనా ఉందా, లేదా అని నిర్దారించేందుకు శునకాలను ఉపయోగిస్తున్నాయి. కానీ భారత ఆర్మీ మాత్రమే వాటిని అందుకు ఉపయోగిస్తోంది. కానీ వాటిని ఎయిర్‌పోర్టుల్లో కూడా ఉపయోగిస్తే అప్పుడు కోవిడ్ ఉన్న వారిని గుర్తించడం మరింత సులభతరం అవుతుంది. ప్రయాణికులు గంటల తరబడి టెస్టుల కోసం వేచి చూడాల్సిన పనిలేదు. కాగా ఆ రెండు శునకాలు ఇప్పటి వరకు 3,800 శాంపిల్స్‌ను పరీక్షించాయి. వాటిల్లో 22 శాంపిల్స్‌లో కోవిడ్ ఉన్నట్లు పసిగట్టాయి.