మా నేలపై మేం రష్యా దురాక్రమణను అడ్డుకుంటామని, మూడో ప్రపంచ యుద్ధం ఉండబోదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాతో వార్ ఇంకా ఆగలేదని, కానీ ఇది మలుపు తిరుగుతోందని ఆయన చెప్పారు. 2023 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల సందర్భంగా వర్చ్యువల్ గా ఆయన మెసేజ్ ఇచ్చారు. ఆయనను అమెరికన్ యాక్టర్ సీన్ పెన్ పరిచయం చేశారు. ఉక్రేనియన్ల స్వేచ్ఛకు మద్దతునిస్తున్నవారికి జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామ్యం కోసం, జీవించే హక్కుకోసం తాము పోరాడుతున్నామని, ఇందులో సందేహానికి తావు లేదని చెప్పారు.
మొదటి ప్రపంచ యుద్ధం లక్షలాదిమంది ప్రాణాలను బలిగొందని, రెండో ప్రపంచ యుద్ధంలో కోట్లాదిమంది మరణించారని అన్నారు. ఇక మూడో ప్రపంచ యుదమన్నది ఉండదని స్పష్టం చేశారు. ‘ఇది 2023 సంవత్సరం.. మా దేశంలో వార్ ఇంకా ముగియలేదు..ఇందులో ఎవరు విజయం సాధిస్తారన్నది ఇదివరకే తేలిపోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 1943 లో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రదానం ప్రారంభమైందని, అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశకు వచ్చిందని జెలెన్స్కీ గుర్తు చేశారు.
రష్యాతో జరుగుతున్న వార్ లో తమదే విజయమని ఆయన వ్యాఖ్యానించగానే అనేకమంది హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. మనమంతా ఆ విజయాన్ని కలిసికట్టుగా ఆస్వాదిద్దాం అని ఆయన అన్నారు.
అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హాజరైనవారికి జెలెన్స్కీ ని పరిచయం చేసిన నటుడు సీన్ పెన్ మాట్లాడుతూ.. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ విజయం ఖాయమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వార్ లో జెలెన్స్కీకి మద్దతునిచ్చేందుకు ఆయన గత ఏడాది నవంబరులో కీవ్ నగరాన్ని సందర్శించారు. అంతకు ముందు ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. గత ఏడాది గ్రామీ అవార్డుల సందర్భంగా కూడా జెలెన్స్కీ.. ఓ బంకర్ నుంచి వర్చ్యువల్ గా మాట్లాడారు. రష్యాతో జరుగుతున్న వార్ లో తమకు సహకరించాలని కోరారు.