– అన్నివిభాగాల్లో 80,039 ఖాళీలు
– మార్చి 9 నుంచే నోటిఫికేషన్లు: కేసీఆర్
– స్పష్టత ఇవ్వని అధికారులు
– మాట మార్చి చేతులు దులుపుకుంటారా!
– టీఎస్పీఎస్సీ కాకుండా …
– కొత్త బోర్డ్ ఏర్పాటు కు రంగం సిద్దం
– మరి నోటిఫికేషన్ ఎందుకు..నిరుద్యోగుల ఆవేదన
– కేసీఆర్ ఎత్తుగడ అంటున్నవిపక్షాలు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు అన్నివిభాగాల్లోని 80,039 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.వాటికి సంబంధించి మార్చి 9 నుంచే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు కూడా వెల్లడించారు. ఉద్యోగాలు అయితే ప్రకటించారు.కానీ..నోటిఫికేషన్లు ఎప్పటి నుండి అన్నఅంశంపై మాత్రం తెలంగాణ నిరుద్యోగులకుఎలాంటి స్పష్టత లేకుండా పోయింది.
అందుకు సంబంధించి ప్రభుత్వం అధికారులు కూడా ఏమీ చెప్పడం లేదు.అసెంబ్లీలో ప్రకటించిందే కానీ..ఇప్పటి వరకు ఏ ఒక్కరు నోరు మెదపడంలేదు.పొద్దున లేస్తే మీడియాలకు ఇంటర్యూలు ఇస్తున్నటీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి కూడా నోటిఫికేషన్లు ఫలానా తేదీ నుంచి వస్తాయని చెప్పడానికి సంకోచిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇవన్నీ చూస్తుంటే అసలు నోటిఫికేషన్ ఉన్నట్టా లేనట్టా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు విద్యార్ధులు.
అయితే..ప్రభుత్వం ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఉద్యోగాల భర్తీ చేసిన రికార్డు లేకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేయడం టీఎస్పీఎస్సీ వల్ల కాదని..కొత్త బోర్డును ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా ప్రభుత్వవర్గాలు మీడియాకు లీక్ లు ఇచ్చాయి.గ్రూప్స్ ఉద్యోగాలు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసినా..ఇతర పోస్టులన్నీకొత్త బోర్డుద్వారా భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఇదే విషయమై ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులతో సైతం చర్చించినట్లు సమాచారం.
టీఎస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి,ఇద్దరు ఐఏఎస్ లకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.టెక్నికల్ పరమైన ఉద్యోగాలతో పాటుగా..ఇంజనీరింగ్ ఉద్యోగాల నియామకం ఈ బోర్డుకు అప్పగించే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.అయితే.. ఉద్యోగాల నోటిఫికేషన్లకు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయడం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడు కొత్తగా బోర్డు ఏర్పాటు చేసి..భర్తీ చేస్తామని చెప్పడం..ఆలస్యం చేయడానికే అనే అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు.ఇదంతా చూస్తుంటే ఆకాశాన్ని చూపించి అరచేతిని నాకిచ్చినట్టే ఉందంటున్నారు విశ్లేషకులు.
Advertisements
ఇప్పటికే ఏళ్ల తరబడి చదువుతున్నామని..ఇప్పటికీ నోటిఫికేషన్ లు లేక అనేక మంది వయస్సు అయిపోయి.. చేసుకోను పని లేక కూలి పనులకు పోతున్నారని వాపోతున్నారు.కేసీఆర్ ప్రకటించిన నోటిఫికేషన్ లో మేకపోతు గాంభీర్యం తప్పితే.అమలయ్యే పని ఒక్కటీ లేదంటున్నారు.మొత్తంగా చూస్తే కేసీఆర్ ప్రకటన నిరుద్యోగుల్లో ఏ మాత్రం నమ్మకం కలిగించలేదు.ఆ తర్వాత తీసుకుంటున్నచర్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఇది ప్రభుత్వంపై నమ్మకం సడలిపోవడానికి కారణం అవుతోందనేది విశ్లేషకుల మాట.