ఇండియాలో ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం కింద ఎన్డీయే విజయం ఖాయమని ఆయన చెప్పారు. ఆ ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచి మోడీ తిరిగి ప్రధాని అవుతారని ఆయన పరోక్షంగా అన్నారు. ఆదివారం కోల్ కతా శివార్లలోని సోనార్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ దేశ ప్రజలు మోడీ నాయకత్వం పట్ల ఇప్పటికే రెండు సార్లు విశ్వాసం ప్రకటించారన్నారు.
ఈ దేశాన్ని పాలించే బాధ్యతను పేదలు, మహిళలు, యువకులు, గ్రామీణ ప్రజలు.. ఇలా అన్ని వర్గాలవారూ మోడీకి ఇచ్చారని చెప్పారు. 2024 లోనూ ఎన్డీయే విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఆ ఎన్నికలు బీజేపీకి అనుకూలం కాకపోవచ్చునని, బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి ఈ దేశ ప్రధాని అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రధాన్ ఈ కామెంట్స్ చేశారు.
ఇండియాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న నరేంద్ర మోడీకి ఎవరూ సాటి రారని ఆయన చెప్పారు. అయితే అమర్త్య సేన్ చేసిన వ్యాఖ్యల పట్ల బెంగాల్ లోని విపక్ష నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో బాటు సీపీఎం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు విపక్షాల ఐక్యతను చీల్చేందుకు మమతా బెనర్జీ ని మోడీ ఓ సాధనంలా వినియోగించుకుంటున్నారని, కానీ ఈ విషయాన్ని అమర్త్యసేన్ గుర్తించలేకపోతున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి వ్యాఖ్యానించారు.