నోబెల్ శాంతి పురస్కారం 2022ను ప్రకటించారు. ఈసారి శాంతి పురస్కారాన్ని ఓ వ్యక్తితో పాటు మరో రెండు సంస్థలకు కలిపి ప్రకటించింది నోబెల్ కమిటీ. నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. బెలారస్ కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్ బైల్యాట్‌స్కీతో పాటు రష్యన్ మానవ హక్కుల సంస్థ మెమోరియల్, ఉక్రెనియన్ మానవ హక్కుల సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు ఈ సారి నోబెల్ దక్కింది. మానవ హక్కుల కోసం వారు చేస్తున్న విశేష కృషికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఇచ్చినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు వివరించింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్లు నిరంతరం ప్రశ్నించారని తెలిపింది.
పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు కమిటీ, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వాల అరాచకాలను ప్రశ్నించారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడం కోసం పాటుపడ్డారని పేర్కొంది. కాగా నోబెల్ శాంతి బహుమతి కోసం 343 మంది పోటీ పడగా.. మానవ హక్కుల సంఘాలకు ఈ సారి అవార్డు లభించింది. 1980లలో బెలారస్లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో అలెస్ ఒకరు. అయితే అలెస్ బైల్యాట్‌స్కీని 2020లో విచారణ లేకుండానే అక్కడి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది.
నోబెల్ శాంతి బహుమతి గెలిచినవాళ్లు తమ స్వదేశాల్లో సివిల్ సొసైటీ తరపున పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్లు నిరంతరం ప్రశ్నించారని, పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు కమిటీ తెలిపింది. యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్లు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. అయితే ఇప్పటికే ఈ ఏడాదికి గాను వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్య రంగంలో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
నోబెల్ బహుమతి గ్రహీతలకు సుమారు 9లక్షల డాలర్ల నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా,1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.