ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన ముగ్గురు ఎకానమిస్ట్‌లు ఎంపికయ్యారు. అమెరికా ఆర్థిక శాస్త్ర నిపుణులైన బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ దిబ్విగ్‌లకు అవార్డు ప్రకటించింది నోబెల్ కమిటీ. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకు వీరికి అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన, సాహిత్య రంగాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. శాంతి బహుమతి విజేతలను సైతం వెల్లడించారు. ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రకటనతో ఈ ఏడాది అన్ని రంగాల్లో అవార్డుల విజేతలను ప్రకటించినట్లైంది.
స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్‌కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. ‘పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్’లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు.
సాహిత్య రంగంలో ఫ్రెంచ్ రచయిత్రి అనీ ఎర్నాక్స్ నోబెల్ అవార్డును దక్కించుకున్నారు. మానవహక్కుల కోసం పాటుపడిన బెలారస్‌కు చెందిన అలెస్ బియాలియాట్స్కీ, రష్యన్ మానవ హక్కుల సంస్థ అయిన ‘మెమోరియల్’, ఉక్రెయిన్ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంస్థ అయిన ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి వరించింది.