సాహిత్య రంగంలో 2022 సంవత్సరానికి నోబెల్ అవార్డును దక్కించుకున్నాడు ఓ ఫ్రెంచ్ రచయిత. ఇప్పటి వరకూ వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో పలువురు నోబెల్ విజేతల పేర్లను ప్రకటించింది నోబెల్ కమిటీ. తాజాగా సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్ బహుమతి ఫ్రెంచ్ రచయిత ఎర్నాక్స్ కి దక్కింది. కాగా సోమవారం వైద్య రంగం, మంగళవారం భౌతిక శాస్త్రం నోబెల్ విజేత పేరును ప్రకటించారు. బుధవారం రసాయన శాస్త్రంలో విజేతల పేర్లు, గురువారం సాహిత్య రంగంలో విజేత పేరును ప్రకటించారు. అయితే శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి విజేతను, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు.
ఇక రసాయన శాస్త్రానికి సంబంధించిన విభాగంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ ప్రైజ్ వరించింది. కారోలిన్ బెర్టోజి, మార్టిన్ మెల్డల్, బారీ షార్ప్‌లెస్‌ను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. 2022 సంవత్సరానిగానూ వీరిని నోబెల్ అవార్డుకు ఎంపిక చేశారు. క్లిక్ కెమిస్ట్రీ, బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీలో విశేష పరిశోధనలు చేసినందుకు వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం వెల్లడించింది.
ఇప్పటికే భౌతిక శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు కూడా నోబెల్ బహుమతి దక్కింది. ఫోటాన్ల పరిశోధన, క్వాంటమ్ ఇన్ ఫర్మేషన్ సైన్స్‌లో చేసిన ప్రయోగాలకు గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారికంగా నోబెల్ ప్రైజ్ ని ప్రకటించింది. ఈ ముగ్గురి శాస్త్రవేత్తల పరిశోధన ఆధారంగా క్వాంటమ్ ఇన్ఫర్మేషన్‌లో కొత్త టెక్నాలజీకి మార్గం ఈజీ అయింది. ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటర్స్, క్వాంటమ్ నెట్‌వర్క్స్, సెక్యూర్ క్వాంటమ్ ఇన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లో విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి.
కాగా నోబెల్ బహుమతి గ్రహీతల ముగ్గురికీ రూ.10 లక్షల స్వీడిష్ క్రోనర్ నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడిష్ ఆవిష్కరణ కర్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ మరణించగా, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డును అందజేస్తున్నారు.