ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ అవార్డు స్వీడన్ శాస్త్రవేత్త స్వాంటే పాబోకు దక్కింది. వైద్యరంగంలో ఆయనే చేసిన విశేష పరిశోధనలకు గాను ఆయన ఈ పురస్కారం లభించింది. ఆయన సేవలను గుర్తించి ఆయనకు నోబెల్ బహుమతి ప్రకటిస్తున్నట్టు నోబెల్ కమిటీ సెక్రెటరీ థామస్ పెర్ల్మన్ తెలిపారు.
మానవులకు అత్యంత సమీప జాతిగా భావిస్తున్న నియాండెర్తల్స్, డెనిసోవాన్స్ జీవులపై ఆయన పరిశోధనలు చేశారు. ఆ జీవులపై జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల బృందానికి పాబో నాయకత్వం వహించారు.
రెండు జాతుల మధ్య కలయిక జరిగిందనే విషయం ఆయన పరిశోధనల ద్వారా వెల్లడైంది. వైద్య రంగంలో అవార్డును ప్రకటించడంతో ఈ ఏడాది నోబెల్ బహుమతులు సందడి మొదలైనట్లైంది. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత పేరును మంగళవారం ప్రకటించనున్నారు.
రసాయన శాస్త్రంలో బుధవారం, సాహిత్య రంగాల్లో గురువారం విజేతల పేర్లను నోబెల్ కమిటీ ప్రకటించనుంది. మరోవైపు శుక్రవారం శాంతి బహుమతి విజేతను, ఈ నెల10న ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడించనున్నారు.