ఆస్కార్ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటునాటు’ పాట గెలుపుబావుటా ఎగురవేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారాన్ని ముద్దాడింది. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది. 130 కోట్ల మంది భారతీయులను సంబరాల్లో ముంచెత్తింది. ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
కానీ భారత్ నుంచి మొట్టమొదటి సారిగా ఉత్తమ గీతంగా ఆస్కార్ గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ మూవీపై ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి ఒక్కరూ కూడా స్పందించలేదు. అమితాబ్, షారూక్, సల్మాన్, అమీర్ మొదలగు హీరోల నుంచి శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ వంటి హీరోయిన్ల వరకు ఏ ఒక్కరూ ఈ విషయం పై నోరు మెదపడం లేదు.
కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు పెట్టడం లేదు. దీంతో తెలుగు సినీ లవర్స్ బాలీవుడ్ పై భగ్గుమంటున్నారు. ఇంతటి గౌరవం కలగడం బాలీవుడ్ తారకు ఇష్టం లేదని, వాళ్లు ఈర్ష్యతో రగిలిపోతున్నారంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు.
బాలీవుడ్ సాధించలేనిదాన్ని రాజమౌళి సాధించి చూపాడనే కోపంతోనే వాళ్లంతా స్పందించడం లేదని వారంటున్నారు.ఎలాంటి వివక్షత లేకుండా పాన్ ఇండియా మూవీ కాన్సెప్ట్‌తో హిందీ సినిమాలను తాము ఎంతో ప్రేమతో ఆదరిస్తోంటే..తమ సినిమాను మాత్రం బాలీవుడ్ పట్టించుకోవడం లేదని వారు ఫైర్ అవుతున్నారు.
తమ సినిమాలను కూడా అదే స్ఫూర్తితో చూడాలని, లేకుంటే భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో హిందీ సినిమాలను బాయ్ కాట్ చేస్తామంటూ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ బాలీవుడ్ కు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఇప్పటి వరకు ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న దీపికా ఒక్కరే నాటునాటు సాంగ్ గురించి , ట్రిపుల్ ఆర్ గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు.