-రాష్ట్రపతి ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల పర్వం బుధవారం ప్రారంభమైంది.
జూన్ 29 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్టు సీఈసీ తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు జూలై2ను చివరితేదీగా ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికను జులై 18న నిర్వహించనున్నారు.
ఇక కౌంటింగ్ ప్రక్రియను జులై 21న చేపట్టనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ పదవీ కాలంలో జూన్ 24తో ముగియనుంది. దీంతో నూతన రాష్ట్రపతి కోసం ఎన్నికను నిర్వహించనున్నారు.
రహస్య బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసన సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మెల్యేలు కూడా ఈ ఓటింగ్ లో పాల్గొంటారు.