తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక అంకంలోని కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు చండూరులోని రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి రోజు కావడంతో శుక్రవారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. చివరి రోజు మొత్తం వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి సైతం కొందరు అభ్యర్థులు ఇక్కడి వచ్చి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది.
అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ నుండి కేఏ పాల్, బీఎస్పీ నుండి అందోజు శంకరాచారి, టీజేఎస్ నుండి పల్లె వినయ్ కుమార్ గౌడ్‌లు బరిలో నిలిచారు. గురువారం వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
గురువారం ఒక్కరోజే 24 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయనేది అధికారులు ఫైనల్ చేయాల్సి ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంది. శనివారం నుంచి నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. అనంతరం నవంబర్ 3వ తేదీన పోలింగ్, 6న కౌంటింగ్ జరగనుంది.
నామినేషన్ల ఎపిసోడ్ ముగియడంతో ప్రస్తుతం పార్టీల ప్రచార పర్వం జోరందుకోనుంది. ఇప్పటికే అధికార పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ఊపును పెంచాయి. తమ పార్టీని గెలిపించేందుకు అన్ని రకాల సదుపాయాలను రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటున్నారు. మునుగోడు ప్రజలకు వరాల జల్లును కురిపిస్తున్నారు.