తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సూర్యాపేట జిల్లా గుర్రంబోడు వివాదాస్పద భూముల వద్ద జరిగిన ఘర్షణపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఆదివారం నాటి ఘర్షణకు సంబంధించి మొత్తం 21 మందిపై కేసులు నమోదు చేశారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాగ్యరెడ్డితో కలిపి మొత్తం 21 మందిని ఇందుకు కారణంగా చూపారు. వీరందరిపైనా మఠంపల్లి పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే ఇదే అంశంలో అక్కడ బీజేపీ పర్యటనను కవర్ చేయటానికి వెళ్లిన జర్నలిస్ట్ రఘును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. బండి సంజయ్ ఏ-20, ఎమ్మెల్యే రఘునందన్ ఏ-21గా ఉండగా… జర్నలిస్ట్ రఘును మాత్రం ఏ-19గా చేర్చటంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది.
అటు ఈకేసులో ప్రధాన నిందితుడిగా భాగ్యరెడ్డిని చేర్చిన పోలీసులు.. ఆయనతో పాటు మరో ఆరుగురిని కోదాడ మెజిస్ర్టేట్ ఎదటు హాజరు పరిచారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిందరిని నల్గొండ జిల్లా జైలుకు తరలించారు.